Tuesday, December 2, 2008

మన పూర్వీకులు, మన చరిత్ర

బలి చక్రవర్తి:

ప్రహ్లాదుని మనవడు, వీరోచన - దేవంబ ల సుపుత్రుడు, రాక్షసులకు రాజు, ఇంద్రసేన నామధేయుడు, ప్రపంచానికి మహాబలి గా బలి చక్రవర్తి గా సుపరిచితుడు. ఇతని వంశానికి చెందిన వారిని బలి జన్మస్థులు గా గుర్తించారు. వారినే బలిజులు గా బలిజ వారు గా పిలిచారు.

తాత ప్రహ్లాదుని భక్తి మార్గముననుసరించి అసుర పాలకుడు అయ్యాడు. తన రాజ్యం లో శాంతి - సౌభాగ్యాలు విలసిల్లేవి. సామ్రాజ్య విస్తరణ లో భాగం గా స్వర్గాన్ని జయించాడు. దేవతలని పాలించే ప్రభువు ఒక రాక్షసుడు అనే సత్యం మింగుడుపడని సురులు విష్ణు దేవుని శరణు జొచ్చారు. మహావిష్ణువు వారికి అభయమిచ్చి తానే దైవాధికారాన్ని పునఃప్రతిశ్తిస్తానని మాటిచ్చాడు. గురువు శుక్రాచార్యుని ప్రోద్బలం తో అశ్వమేధ యాగాన్ని చేస్తున్న బలి ని విష్ణువు వామనావతారములో మూడు అడుగుల భూభాగాన్ని దానం అడిగాడు. దానగున సంపన్నుడైన బలి గురువు మాటలను సైతం లెక్క చేయక వామనునికి దానం ఇచ్చాడు. వామనుడు ఒక పాదాన్ని భూమి పై మరొక పాదాన్ని ఆకాశం పై మోపి మూడవ పాదాన్ని ఎక్కడ మోపాలి అని బలిని అడిగాడు. బలి తన శిరసు పై మోపమని తలను వంచాడు. తన తల పై పాదం మోపి వామనుడు బలిని అధఃపాతాళానికి త్రొక్కి వేసాడు. బలి ధర్మాన్ని మెచ్చిన విష్ణువు తనకి స్వర్గం లో స్తానాన్నిచ్చాడు.

శ్రీ కృష్ణ దేవరాయలు (1509 - 1529):
విజయనగర సామ్రాజ్యాధిపతులలో అత్యంత ఖ్యాతి గడించినవాడు, తన అత్యద్భుత పరిపాలన తో ఇటు ఆంధ్రులకు, అటు కన్నడిగులకు అత్యంత ప్రీతిపాత్రుడు, భారత దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో తన పుటను లిఖించటానికి సర్వవిధాల అర్హుడు.
బిరుదులు: కన్నడ రాజ్య రమా రమణ, మూరు రాయర గండ (ముగ్గురు రాజులకు రాజు), ఆంధ్ర భోజ, కర్ణాటకాంధ్ర సమన్వయకర్త మరియు సాహితీ సమరాంగణ చక్రవర్తి
తల్లిదండ్రులు: నాగల దేవి, తుళువ నరస నాయకుడు
సాలువ నరసింహ దేవరాయుని సేనాధిపతి అయిన తుళువ రాజ్యాన్ని కాపాడేందుకు సింహాసనమును అధిశ్తించినాడు. జూలై 26, 1509 న శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన కృష్ణదేవరాయలు పట్టాభిషిక్తుడయ్యాడు. తల్లి స్మృత్యర్థం విజయనగర పొలిమేరల్లో నాగలాపురమును నిర్మించాడు.

రాయల ఆస్థానానికి ముఖ్యుడు మహామంత్రి తిమ్మరుసు. రాయలు అతనిని ప్రేమ తో అప్పా అని సంబోధించే వాడు. కన్నడ లో (తమిళం లో కూడా) అప్పా అంటే అయ్యా అని అర్థం. కర్నూలు, అనంతపురము జిల్లాల్లో (కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో) ఈ సంబోధన ఇప్పటికీ వాడుక లో ఉంది.

విజయనగర సామ్రాజ్యము:

ఇప్పటి ఉత్తర కర్ణాటకలో ని బళ్ళారి జిల్లా లో విజయనగర సామ్రాజ్యము ఏర్పడినది. భౌగోళికంగా ఇది 15°19′N 76°28′ నందు కలదు.
సామ్రాజ్యము లో ని అత్యధిక భాగము తుంగభద్రా నది కి దక్షిణ ఒడ్డున కలదు. హంపి లో ని అతి పవిత్ర ప్రదేశమయిన విరూపాక్ష దేవాలయం చుట్టుప్రక్కల నిర్మించబడ్డది. పండిట్ నెహ్రూ రచించిన 'ది డిస్కవరీ అఫ్ ఇండియా' లో విజయనగరమును దాని యొక్క ప్రాశస్త్యాన్ని ప్రస్తావించాడు. 15వ శతాబ్దానికి విజయనగరము 5,00,000 పౌరులతో భారత దేశం లో నే అతి పెద్ద నగరము. ప్రపంచం లో ని అతి పెద్ద నగరములోనే ఇది ద్వితీయము.



విజయనగర సామ్రాజ్యం లో ని కొన్ని అతి ముఖ్యమైన కట్టడాలు:






విరూపాక్షుని ఆలయం: హంపి నగర కేంద్ర బిందువు. పంపాపాటి ఆలయం గా కూడా ప్రసిద్ధి చెందినది. 13 - 17 శతాబ్దాలలో విస్తరణ చెందినది. 50 అడుగుల ఎత్తు గల గోపురం తూర్పు ముఖం గా ఉన్నది. ఎదురుగా ఉన్నా రహదారి పై 1 కి. మీ దూరాన నంది విగ్రహం కలదు.

కృష్ణాలయం: హేమకూట శిఖరం పై కొలువుదీరినది.