Tuesday, March 17, 2009

రాజనాల కాళేశ్వరరావు



విలన్ అన్న పదానికి మారుపేరుగా రాజనాల చాలా కాలం తెలుగు సినిమా ప్రేక్షకుల స్మృతుల్లో నిలిచిపోయాడు. ఇతని పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు నాయుడు. పౌరాణిక చిత్రాలలోనూ, జానపద చిత్రాలలోనూ, సాంఘిక చిత్రాలలోనూ కూడా ప్రతినాయక పాత్రలలో రాణించాడు. కంసుడు, జరాసంధుడు, మాయల ఫకీరు, భూకామందు, దొంగల నాయకుడు - ఇలా ఎన్నో పాత్రలలో విలన్‌గా నటించాడు.


నటించిన చిత్రాలు

  • హలో బ్రదర్ (1994)
    భలే తమ్ముడు (1985)
    నకిలీ మనిషి (1980)
    సప్తస్వరాలు (1969)
    వరకట్నం (1968)
    గూఢచారి 116 (1967)
    శ్రీకృష్ణావతారం (1967)
    శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967)
    పల్నాటి యుద్ధం (1966)
    శ్రీకృష్ణ పాండవీయం (1966)
    సత్య హరిశ్చంద్ర (1965)
    బొబ్బిలి యుద్ధం (1964)
    రాముడు భీముడు (1964)
    నర్తనశాల (1963)
    పరువు ప్రతిష్ఠ (1963)
    గుండమ్మ కథ (1962)
    దక్షయజ్ఞం (1962)
    సిరిసంపదలు (1962)
    జగదేకవీరుని కథ (1961)
    ఉషాపరిణయం (1961)
    సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960)
    శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960)
    రాజమకుటం (1959)
    సువర్ణసుందరి (1957)
    కుటుంబ గౌరవం (1957)
    వినాయక చవితి (1957)
    తెనాలి రామకృష్ణ (1956)
    జయసింహ (1955)
    ప్రతిజ్ఞ
    పిడుగురాముడు
    అగ్గిపిడుగు

రమేష్ నాయుడు



పసుపులేటి రమేష్ నాయుడు 1970వ మరియు 80వ దశకములో సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు. ఆయన సృష్టించిన పాటలు రాశి తక్కువైనా వాసి ఎక్కువ. ఆయన సంగీతము సమకూర్చిన మేఘసందేశం చిత్రంలోని పాటలు సంగీత పరంగా చాలా ప్రసిద్ధి గాంచినవి.
రమేష్ నాయుడు 1933లో కృష్ణా జిల్లా, కొండపల్లిలో జన్మించాడు. యుక్తవయసులో ఇల్లు వదిలి బొంబాయికి పారిపోయి ఒక సంగీత వాయిద్యాలమ్మే దుకాణములో పనిచేశాడు. అక్కడ ఆయనకు వివిధ రకాల సంగీత వాయిద్యాలు వాయించే అవకాశం దొరికింది. అక్కడే ఆ అంగడికి వచ్చే వివిధ హిందీ సంగీత దర్శకులతో పరిచయాలు ఏర్పరచుకొనే అవకాశం కూడా కలిగింది. ఈయన 16యేళ్ళ వయసులో సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా బంద్వల్ పహీజా అనే మరాఠీ సినిమా.
ఈయనను తెలుగులో సి.కృష్ణవేణి నిర్మించిన దాంపత్యం సినిమాతో తెలుగు చిత్రరంగానికి పరిచయం చేసింది. ఆ సినిమా తరువాత మనోరమ (ఈ చిత్రం లో ప్రముఖ హిందీ గాయకుడు తలత్ మెహమూద్ తో రెండు పాటలు పాడించారు)లాంటి ఒకటి రెండు తెలుగు సినిమాలలో పనిచేసి 60వ దశకము ప్రారంభము కళ్ళా తిరిగి బొంబాయి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి కలకత్తాకు మారి అనేక బెంగాళీ చిత్రాలకు పనిచేసి అక్కడే ఒక బెంగాళీ యువతిని పెళ్ళిచేసుకున్నాడు. 10 సంవత్సరాల పాటు అనేక బెంగాళీ, నేపాలీ మరియు ఒరియా సినిమాలకు సంగీతము అందించాడు.
తెలుగులో రమేష్ నాయుని పునఃప్రవేశం 1972లో విడుదలైన శోభన్ బాబు చిత్రం అమ్మమాట తో జరిగింది. ఆ తరువాత ఆయన తెలుగు సినిమాలలో కొనసాగాడు. 1970 మరియు 80లలో ఈయన ప్రతిభను పూర్తి స్థాయిలో వినియోగించుకొని తెలుగు సినీ రంగానికి కొన్ని అత్యుత్తమ మధురగీతాలను అందించిన దర్శకులలో దాసరి నారాయణరావు, విజయ నిర్మల మరియు జంధ్యాల ప్రధానమైన వారు.
రమేష్ నాయుడు గీతాలను తీసుకొని వాటికి మధురమైన బాణీలు కట్టేవాడు. ఇలాంటి శైలిలో పనిచేసే అతికొద్ది సంగీత దర్శకులలో కె.వి.మహదేవన్ తో పాటు ఈయనా ఒకడు. వేటూరి సుందరరామ్మూర్తి తెలుగు సినీ సంగీతదర్శకులు మరియు దర్శకులతో తన అనుబంధము గురించి రచించిన కొమ్మ కొమ్మకో సన్నాయి పుస్తకంలో కె.వి.మహదేవన్, ఎన్టీ రామారావు, ఆత్రేయ, బాలు, ఇళయరాజా వంటి వారికి ఒక్కొక్క అధ్యాయము కేటాయించగా రమేష్ నాయుడు ఒక్కనికే రెండు అధ్యాయములు కేటాయించాడు.
రమేష్ నాయుడు హిందీ చిత్రరంగానికి లక్ష్మీకాంత్-ప్యారేలాల్ ను పరిచయం చేశాడు. మణిశర్మ తండ్రి యనమండ్ర నాగయజ్ఞశర్మ రమేష్ నాయుని ఆర్కెస్ట్రాలో శాశ్వత సభ్యుడు. ఈయన చివరి చిత్రం కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వయంకృషి. ఈ సినిమా విడుదలయ్యే ముందు రోజే 1987, సెప్టెంబర్ 3న మరణించాడు.
చిత్రమాలిక:

  • అహ! నా పెళ్ళంట !
  • ఆశాజ్యోతి
  • అద్దాలమేడ
  • రెండుజెళ్ళ సీత
  • అల్లరి బావ
  • అమృతకలశం
  • అందాలరాశి
  • అంతం కాదిది ఆరంభం
  • అంతులేని వింతకధ
  • బంగారక్క
  • బంట్రోతు భార్య
  • భద్రకాళి
  • ఒకమ్మాయి
  • భోళా శంకరుడు
  • భోగిమంటలు
  • చలాకీ చెల్లెమ్మ
  • కలెక్టర్ విజయ
  • దాంపత్యం
  • దేవదాసు మళ్లీ పుట్టాడు
  • దేవదాసు (1974 సినిమా)
  • దేవుడే గెలిచాడు
  • దేవుడు చేసిన మనుషులు
  • ధైర్యవంతుడు
  • గంగ మంగ
  • హేమా హేమీలు
  • ఇల్లే స్వర్గం
  • కల్యాణి (1979)
  • ఖైదీ కృష్ణుడు
  • కొత్తనీరు (1982)
  • శివరంజని
  • శ్రీవారి శోభనం
  • శ్రీవారికి ప్రేమలేఖ
  • కుడి ఎడమైతే
  • కూతురు కాపురం
  • మాకు స్వతంత్రం వచ్చింది
  • మహాలక్ష్మి
  • ముద్దబంతి పువ్వు
  • ముద్ద మందారం
  • మీనా (1974 సినిమా)
  • మేఘ సందేశం (సినిమా)
  • మొగుడు పెళ్ళాలు
  • నాగమల్లి నాలుగు స్తంభాలాట
  • నీడ
  • జయసుధ (సినిమా)
  • వయ్యారి భామలు
  • వగలమారి భర్తలు
  • వీణ
  • ప్రణయ గీతం
  • ప్రేమ సంకెళ్ళు
  • పసుపు పారాణి
  • పెళ్ళి నీకు అక్షింతలు నాకు
  • సుజాత (సినిమా)
  • సూర్యచంద్రులు
  • స్వయంకృషి
  • తాతా మనవడు
  • తాతయ్య ప్రేమలేఖలు
  • తల్లి గోదావరి
  • తూర్పు పడమర
  • సత్యాగ్రహం
  • చందన (సినిమా)
  • మల్లె మొగ్గలు
  • మల్లెల పందిరి
  • మంచు పల్లకి
  • జీవితం (1973 సినిమా)
  • సంసారం-సాగరం
  • సంఘం చెక్కిన శిల్పాలు

Sunday, March 1, 2009

సాలూరు రాజేశ్వరరావు (1922 – 25 October 1999)


సాలూరు రాజేశ్వరరావు (Saluru Rajeswara Rao) తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించి, తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకులలో ఒకడు. ఎన్నో అజరామరమైన వెండితెర వెలుగులకు సంగీతపు మధురిమలు అందించినవారిలో ఆయనకు ప్రత్యేక స్థానముంది.
సాలూరు రాజేశ్వరరావు సాలూరు మండలములోని శివరామపురం గ్రామంలో 1922 సంవత్సరంలో జన్మించాడు. రాజేశ్వరరావుకి అతి చిన్న వయసులోనే సంగీతం అబ్బింది. ప్రారంభంలో తండ్రి సన్యాసిరాజు వద్దే “సరిగమలు” దిద్దాడు. సన్యాసిరాజుగారు ప్రముఖ వాయులీన విద్వాంసులైన ద్వారం వెంకటస్వామి నాయుడుకి కచేరీలలో మృదంగంపై సహకరించిన వ్యక్తి. అలాగే అప్పట్లో మూకీ సినిమాలకు తెరముందు, హార్మోనియం వాద్యకారునిగా, సంగీతాన్ని వినిపించేవాడు. అంతేకాదు రాజేశ్వరరావు మంచి గేయ రచయిత కూడా! "ఆ తోటలోనొకటి ఆరాధనాలయము", "తుమ్మెదా! ఒకసారి మోమెత్తి చూడమని", "పొదరింటిలోనుండి పొంచి చూచెదవేల", "కలగంటి కలగంటి" లాంటి కొన్ని మంచి మంచి పాటల్ని ఇతని ద్వారానే మనకు లభించాయి.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు, నాలుగేళ్ళ వయసులోనే రాజేశ్వరరావు అనేక రాగాలను గుర్తించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మరో మూడేళ్ళు గడిచేసరికి అన్న హనుమంతరావుతో కలిసి పాట కచేరీలు ఇవ్వడం, హరికథలు చెప్పడం మొదలు పెట్టాడు. రాజేశ్వరరావు ప్రతిభను గుర్తించి హచ్చిన్స్‌ గ్రామఫోను కంపెనీ బెంగుళూరుకు ఆహ్వానించడం జరిగింది. 1933-34 మధ్యకాలంలో “బాల భాగవతార్‌ మాస్టర్‌ సాలూరి రాజేశ్వరావు ఆఫ్‌ విజయనగరం” కంఠం గ్రామఫోను రికార్డుల ద్వారా (భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలు, మోతీలాల్‌ నెహ్రూ పై పాటలు మొదలగునవి) మొదటిగా విజయనగరం ఎల్లలు దాటి యావదాంధ్రదేశానికీ పరిచయమయింది.
సాలూరి ఖ్యాతి సినీ నిర్మాణ కేంద్రమైన మద్రాసు నగరానికి చేరడానికి మరెంతో కాలం పట్టలేదు. ఇతని గాత్ర మాధుర్యానికి ముగ్ధులైన పినపాల వెంకటదాసు, గూడవల్లి రామబ్రహ్మం తమ (వేల్‌ పిక్చర్స్) రెండవ చిత్రానికి, (శ్రీకృష్ణ లీలలు,1935), ఇతనిని “కృష్ణుడి” పాత్రధారునిగా ఎంపిక చేసుకొని మద్రాసుకు చేర్చారు. తొలిచిత్రంలోనే తన గాన, నటనా కౌశలాన్ని సాలూరి తెలుగు ప్రేక్షకులకు చాటి చెప్పాడు. ఆ చిత్రంలో, ముఖ్యంగా, కంసునితో (వేమూరి గగ్గయ్య) సంవాద ఘట్టంలో, గగ్గయ్యలాంటి ప్రఖ్యాత కళాకారునికి దీటుగా ఆయన పాడినపద్యాలు (”ఔరలోక హితకారి”,”దీనావనుడనే”, “ప్రణతులివె”,”మేనల్లుళ్ళని”, ...) వింటుంటే పదమూడేళ్ళ వయసులోనే సాలూరి సంగీత ప్రతిభ ఎంతటిదో తెలుస్తుంది.
“వేల్‌” వారి శశిరేఖాపరిణయం (మాయాబజార్‌ 1936) ఆయన రెండవ చిత్రం. దీనిలో అభిమన్యుడి పాత్రని పోషిస్తూ కొన్ని పాటలు కూడా (నను వీడగ గలవే బాలా, కానరావ తరుణీ) పాడాడు. ఆ చిత్రం పూర్తయిన తరువాత మరొక చిత్రంలో నటించేందుకై కలకత్తాకు చేరుకోవడంతో ఇతని జీవితంలో మరో ముఖ్య ఘట్టం మొదలయ్యింది. గాయక నటునిగా పేరు సంపాదించినా సంగీతకారునిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తృష్ణ ఈయనలో అధికంగా వుండేది. అదే, కలకత్తాలో,”న్యూ థియేటర్స్‌ సంగీతత్రయం”తో (ఆర్‌.సి.బోరల్‌, పంకజ్‌ మల్లిక్‌, తిమిర్‌ బరన్‌) పరిచయాలకు, ప్రముఖ గాయకుడు కె.ఎల్.సైగల్‌ వద్ద శిష్యరికానికి దారి తీసింది. ఇలా ఒక సినిమాలో నటించడానికని కలకత్తా చేరిన వ్యక్తి సంవత్సర కాలం పైగా అక్కడే వుండిపోయి, అక్కడి ఉద్దండుల వద్ద (హిందుస్తానీ) శాస్త్రీయ సంగీతంలోని మెళుకువలు, బెంగాలీ, రవీంద్ర సంగీతరీతులు, వాద్యసమ్మేళన విధానం నేర్చుకున్నాడు. ఆయన తదుపరి సంగీత సృష్టిలో అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. 1938లో మద్రాసుకు తిరిగి వచ్చిన తరువాత సంగీతబృందాన్ని ఏర్పాటు చేసుకొని ఒక తమిళ చిత్రానికి (”విష్ణులీల” 1938) సహాయ సంగీత దర్శకునిగా పనిచేశాడు. మరికొద్ది కాలానికి చిత్రపు నరసింహరావు దర్శకత్వంలో తయారయిన “జయప్రద”(పురూరవ 1939) చిత్రానికి పూర్తి సంగీతదర్శకత్వపు బాధ్యతలు చేపట్టి, అప్పట్లో అత్యంత యువ సంగీతదర్శకుడిగా చరిత్ర సృష్టించాడు. కాని ఆయనకు సినీ సంగీతదర్శకునిగా బాగా గుర్తింపు తెచ్చిన మొదటి సినిమా ఇల్లాలు (1940).
సాలూరిలోని సంగీతదర్శక ప్రతిభను కూడా గుర్తించిన రామబ్రహ్మం “ఇల్లాలు”లో కొన్ని పాటలు చేసే అవకాశం కల్పించాడు. రాజేశ్వరరావు కట్టిన వరసలు రామబ్రహ్మం చిత్రాలకు సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న బి.ఎన్‌.ఆర్‌ కు ( భీమవరపు నరసింహారావు, మాలపిల్ల (1938), రైతుబిడ్డ (1939) ) అమితంగా నచ్చడంతో ఆయన పక్కకు తొలిగి సాలూరినే అన్ని పాటలు చేయమని కోరాడు. ఆ చిత్రం ఆర్ధికంగా విజయవంతం కాకపోయినా ఈయన చేసిన పాటలు పలువురి ప్రశంసలనందుకొన్నాయి.
ఆ చిత్రంతో తెలుగు శ్రోతలకొక కొత్తరకమైన సంగీతం పరిచయం చేయబడింది. “లలిత సంగీత”మన్న దానికి తెలుగులో మొదటిగా శ్రీకారం చుట్టి ఒక కొత్త వొరవడిని సృష్టించాడు. కలకత్తాలో బెంగాలీ సంగీతం ద్వారా ప్రభావితుడైన సాలూరి ఆధునికత్వం కోసం చేసిన ప్రయోగాలు తెలుగు సినీ పరిశ్రమలో అంతగా ఆదరణ పొందకపోయినా, తెలుగు పాటకు పాశ్చాత్య బాణీని యెలా జతపరచవచ్చో “ఇల్లాలు” ద్వారా; ఆ తరువాత ఈయన పాడిన లలిత గీతాల ద్వారా, సమర్ధవంతంగా నిరూపించాడు. ఆర్కెస్ట్రా నిర్వహణలో “హార్మొనీ” యొక్క ప్రాధాన్యత ఏమిటో ఆయనకు అర్థమయినంతగా మరెవ్వరికి కాలేదేమో!
“ఇల్లాలు”లో సాలూరి, బాలసరస్వతి పాడిన “కావ్యపానము చేసి కైపెక్కినానే” అన్న బసవరాజు అప్పారావుగారి పాట ఆనాటి కుర్రగాయకులకు, కుర్రకవులకు చాలామందికి కైపెక్కించింది. ఆ చిత్రం యొక్క మరో ప్రత్యేకత, సాలూరి బాలసరస్వతుల స్వరమైత్రికి నాంది పలికటం. ఆ మైత్రి రికార్డులపై చాలా దూరం సాగి (”కోపమేల రాధా”, “రావే రావే కోకిలా”, “తుమ్మెదా ఒకసారి”, “పొదరింటిలోనుండి”, ...) తెలుగు సంగీత చరిత్రలో ఒక కమనీయమైన ఘట్టంగా శాశ్వతంగా నిలిచిపోయింది. వీరిరువురి గానమాధుర్యానికి ముగ్ధులై తెలుగునాట మూగ గొంతులు సైతం మారుమ్రోగి కొద్దోగొప్పో పాడనేర్చాయి. వారిరువురి కొత్త రికార్డు ఎప్పుడు వస్తుందా అని ఆకాలపు శ్రోతలు ఎదురు చూసేవారు. ఆంధ్రదేశంలో సంగీతరంగానికి నలభయ్యవ దశకం ఒక స్వర్ణయుగమైతే దానిలో సుమారొక యెనిమిదేళ్ళపాటు రాజేశ్వరరావు, బాలసరస్వతులు రాజ్యమేలారంటే అతిశయోక్తి కాదు.
ఇంక తానే బాణీలు కట్టుకొని, మధురంగా, సున్నితంగా ఆలపించిన “చల్లగాలిలో యమునాతటిపై”, “పాట పాడుమా కృష్ణా”, “గాలివానలో ఎటకే వొంటిగ”, “ఓహో విభావరి”, “ఓహో యాత్రికుడా”, “ఎదలో నిను కోరితినోయి”, “షికారు పోయిచూదమా”, “హాయిగ పాడుదునా చెలీ” వంటి పాటలు ఈనాటికీ సంగీతప్రియుల గుండెల్ని పులకరింపజేస్తున్నాయి.
మరో రామబ్రహ్మం చిత్రానికి (అపవాదు (1941), “కోయిలొకసారొచ్చి కూసిపోయింది” లాంటి సుమధుర గీతాలతో) పని చేసిన అనంతరం మంచి అవకాశం రావడంతో “జెమిని” సంస్థలో చేరి, జీవన్ముక్తి (1942) నుంచి మంగళ (1951) వరకు, ఆ సంస్థకు ఆస్థాన సంగీతదర్శకుడిగా పనిచేశాడు. “జెమినీ” వారి బాలనాగమ్మకు (1942) నేపథ్య సంగీతంలో అందులోని భయానక కరుణరస సన్నివేశాలకు అనుగుణంగా మనవారికి నచ్చేరీతిని పాశ్చాత్య స్వరమేళ ఫణితుల్ని అవలీలగా కల్పించి ప్రయోగించాడు. అదే సమయంలో, “జెమినీ”వారి చిత్రానికి పోటీగా తయారయిన “వసుంధర” వారి శాంత బాలనాగమ్మలో (1942) “బాలవర్ధి రాజు” పాత్ర ధరిస్తూ ఆ చిత్రానికి సంగీతాన్ని అందివ్వడం, కొన్ని పాటలు పాడడం (ప్రియజననీ వరదాయని, సుఖదాయి సుఖదాయి) వింతైన విషయం.
“జెమిని”లో పని చేస్తున్న కాలంలోనే అడపదడపా రేడియోవారి నాటకాలకు, సంగీతరూపకాలకు కూడా వరసలు కట్టడం, పాటలు పాడడం చేస్తుండేవాడు. “మోహినీ రుక్మాంగద” (1942, శ్రీశ్రీ రచన) లాంటి నాటకాలకు అందించిన సంగీతం ద్వారా ఆయన అనుభవశాలియైన సంగీత దర్శకుడనిగా నిరూపించుకున్నాడు.
సాలూరి ప్రతిభను యావద్భారత దేశానికి తెలియ జెప్పిన చిత్రం చంద్రలేఖ (1948). కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాలని,లాటిన్‌ అమెరికన్‌, పోర్చుగీస్‌, స్పానిష్‌ జానపద సంగీత పోకడల్ని ఎంతో ప్రతిభావంతంగా సమ్మిళితం చేసి, ఆ కాలంలో వూహించలేనటువంటి పెద్ద వాద్యబృందంతో సృష్టించిన చిత్రమది. “చంద్రలేఖ” తరువాత ఆయన మరి వెనుతిరిగి చూడలేదు.
ఇంక సాలూరి కిరీటంలో కలికితురాయి మల్లీశ్వరి (1951). సినిమా సంగీతంలోను, సినిమా తీసే పద్ధతిలోను గణనీయమైన మార్పులు చెందినా, నాలుగు పుష్కరాల తర్వాతకూడా నేటికీ గల గలా ప్రవహించే నదిలా వీనులవిందు గొలుపుతున్న సాహిత్య సంగీతాల మేళవింపు “మల్లీశ్వరి”. వి.ఎ.కె.రంగారావుగారి మాటల్లో చెప్పాలంటే “బి.ఎన్‌.రెడ్డి కార్యదక్షతతో, దేవులపల్లి మల్లెపూరేకు బరువుతో వ్రాసిన సాహిత్యంతో, పసుమర్తి కృష్ణమూర్తి నృత్య సారధ్యంతో, ఘంటసాల భానుమతిల గళ మధురిమతో యీ చిత్రంలోని సంగీతం తక్కిన అన్ని హంగుల మాదిరిగానే నభూతో నభవిష్యతి అన్న తీరుగా రూపొందింది.” “ఇదొక్కటి చాలు సాలూరి గొప్పతనం తెలియజెప్పడానికి” అనేవారు కొందరైతే, “దీనిని మించిన సంగీతభరితమైన చిత్రం ఇంతవరకు రాలేదు, ఇక ముందు కూడా రాబోదని” దృఢంగా విశ్వసించే వారూ చాలామంది వున్నారు. సాలూరే “మల్లీశ్వరి” పై వ్యాఖ్యానిస్తూ "చంద్రలేఖ" కథకు ఒక కాలం అంటూ లేదు కనుక అన్నిరకాల సంగీతం వినిపించడానికి అవకాశం కలిగింది. కాని, “మల్లీశ్వరి” చరిత్రకు సంబంధించిన చిత్రం. అటు కథాకాలానికి, ఇటు కాస్త ఆధునికంగానూ వుండేలా సంగీతం కూర్చవలసి వచ్చింది. శాస్త్రీయ రాగాలను తీసుకొని, సెమిక్లాసికల్‌ గా స్వరపరిచాను. అలాగే అందులోని ఏ పాటా కూడా ట్యూన్‌కి రాసింది కాదు! బి.ఎన్‌.గారికి సంగీతాభిరుచి ఎక్కువ కావడంతో ఒక్కో పాటకు ఐదారు వరసలు కల్పించవలసి వచ్చింది. ఆ చిత్రానికి మొత్తం ఆరునెలలపాటు మ్యూజిక్‌ కంపోజింగ్‌ జరిగిందని చెప్తే ఈ రోజుల్లో ఎవరికైనా ఆశ్చర్యగా ఉంటుందేమో అని అన్నాడు. ఈ చిత్రంలో చేపట్టని సంగీతప్రక్రియ లేదేమో! ప్రతి సంగీత విద్యార్ధి మొదటిగా నేర్చుకొనే శ్రీగణనాధ సింధూరవర్ణ (మలహరి) అన్న పురందరదాస కృతితో చిత్రం ప్రారంభమవుతుంది. తరువాత తేలికగా పాడుకోగలిగే బాణీలలో పిల్లల పాటలు (ఉయ్యాల జంపాల, రావి చెట్టు తిన్నె చుట్టూ), హాస్య గీతం (కోతీబావకు పెళ్ళంట), ప్రకృతి పాట (పరుగులు తీయాలి), జావళి ( పిలచిన బిగువటరా), జానపదం (నోమీన మల్లాల), వీడ్కోలు పాట (పోయిరావే తల్లి), యక్షగానం (ఉషాపరిణయం), యుగళ గీతం, ఇలా అన్నిరకాల పాటలనందించి విభిన్న శ్రోతలను ఆనందపరచిన చిత్రమిది. మరింత ప్రత్యేకంగా పేర్కొనవలసినది, తెలుగువారందరూ ఎంతో గర్వపడ వలసినది, కాళిదాసుని మేఘసందేశానికేమాత్రం తీసిపోని సాలూరి, దేవులపల్లి, ఘంటసాల భానుమతుల సమిష్టి కృషిఫలితం ఆకాశవీధిలో అన్న పాట. ఈ రాగమాలిక(భీంపలాస్‌, కళంగద, కీరవాణి, హంసానంది) అనురాగరసంతో విరహగీతాన్ని విరచించే తూలిక!
“మల్లీశ్వరి” తరువాత ముఖ్యంగా చెప్పుకోవలసిన చిత్రం విప్రనారాయణ (1954). ఎవ్వాడే అతడెవ్వాడే అన్న అపూర్వమైన రాగమాలికనొక్కసారి (భైరవి, మోహన, కాపి, వసంత) జ్ఞప్తికి తెచ్చుకోండి! ఈ చిత్రంలోని ప్రతి పాటా గొప్పదే. పాలించర రంగా (హేమవతి), చూడుమదే చెలియా (హిందోళం), రారా నా సామి రారా (కల్యాణి), సావిరహే (యమునాకల్యాణి),మేలుకో శ్రీరంగ (బౌళి, మలయమారుతం), …
శాస్త్రీయ సంగీత బాణీలు, కర్ణాటక హిందుస్తానీ రాగాలలో యుగళ్‌ బందీలు , పాశ్చాత్య సంగీత రూపాలు, … ఇలా చేపట్టిన ఏ ప్రక్రియలోనైనా అద్వితీయమైన సంగీతాన్ని విన్పించారు. అనేక సంగీత రీతుల్ని సమన్వయం చేయడంలో ఆయన సాధించిన విజయాలు మరెవ్వరూ సాధించలేదు. వాయిద్యాలపై ఆయనకున్న పట్టును గురించి చిత్రరంగంలో చాల గొప్పగా చెప్పుకొంటారు. 20 - 30 వయొలిన్లు ఒకేసారి వాడిన సందర్భాల్లో ఏ వొక్క వయొలిన్‌ తప్పు పలికినా ఆ నంబరును చెప్పి మరీ గుర్తించే వారని అంటారు. మరో పర్యాయం అతను అడిగిన గమకాన్ని పలికించక పోగా, అది అసాధ్యం అన్న వాద్యకారునికి ఈయనే వెంటనే వయొలిన్‌ను అందుకొని అదే గమకాన్ని పలికించాడు. ఇదెలా సాధ్యపడిందని ఆశ్చర్యపోయేవారికి, ఆయన నిత్యం విద్యార్ధిగానే కొనసాగాడని చెప్పాలి. బాల్యంలోనే తబలా, ఢోలక్‌, మృదంగం, హార్మోనియం నేర్చిన సాలూరి, తరువాత కలకత్తాలో సితార్‌, సుర్బహార్‌ అధ్యయనం చేశాడు. ఆ తరువాత పియానో, మాండలిన్‌, ఎలెక్ట్రిక్‌ గిటార్‌ వాయించడంలో కూడా పరిణతి సాధించాడు. ఇలా పలు వాద్యాలలో ప్రవేశం ఆర్కెస్ట్రేషన్‌ నిర్వహణలో ఈయనకు ఎంతో సహాయపడింది.
లక్ష్మన్న తమ వ్యాసంలో సాలూరిపై పెండ్యాల నాగేశ్వరరావు అభిప్రాయాన్ని పేర్కొన్నాడు. అలాగే సహ దర్శకుల యెడల సాలూరికున్న గౌరవాభిమానాలు గుర్తించదగ్గవి. ఉదాహరణలుగా పెండ్యాల “భీంపలాస్‌”లో స్వరపరచిన నీలిమేఘాలలో గాలి కెరటాలలో (బావామరదళ్ళు, 1960), రమేష్‌ నాయుడు 'కల్యాణి' రాగంలో చేసిన జోరు మీదున్నావు తుమ్మెదా (శివరంజని, 1978) పాటలను తనకు నచ్చిన ఉత్తమమైన గీతాలుగా యెన్నుకుంటూ వారిని కొనియాడడం చెప్పుకోవచ్చు.
ఈయన సుదూర సుస్వర సంగీతయాత్రలో 200కు పైగా చిత్రాలకు, ఎన్నో లలిత గీతాలకు, పెక్కు ప్రైవేటు రికార్డులకు సంగీతాన్ని అందించాడు. ఆయన 40 ఏళ్ళకు పైబడిన సినీ జీవితంలో కనీసం పేరైనా పేర్కొనవలసిన చిత్రాలు రాజు పేద (54), మిస్సమ్మ (1955), భలేరాముడు (1956), మాయాబజార్‌ (1957, 4 పాటలు మాత్రమే), అప్పుచేసి పప్పుకూడు, (1958), చెంచులక్ష్మి (1958), భక్త జయదేవ (1960), అమరశిల్పి జక్కన (1963), భక్త ప్రహ్లాద (1967).
అభేరి (భీంపలాస్‌), కల్యాణి, మోహన, సింధుభైరవి,శంకరాభరణం ఈయనకు ప్రియమైన రాగాలు. శాస్త్రీయ రాగాల్లో ఆయన వినిపించిన వరసలను గురించి మరొక సుదీర్ఘమైన వ్యాసమే రాయవచ్చు. జగమే మారినది (కల్యాణి, దేశ ద్రోహులు 62), నా హృదయంలో నిదురించే చెలీ (శంకరాభరణం, ఆరాధన 62), పాడవేల రాధికా (మోహన, ఇద్దరు మిత్రులు 60), … లాంటి పాటలు మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.
సాధారణంగా, సృజనాత్మకత అన్నది పెరుగుతున్న వయసుతో తగ్గుతూ పోతుంది అనడం కద్దు. కాని, సినీరంగంలోకి అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు దాటిన తరువాత కూడా ఆయనలో అలాంటి తగ్గుదలేమి లేదని చెప్పడానికి ఈ మూడు రికార్డులు, 1977లో చేసిన ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు (ఈనాటి బంధం ఏనాటిదో), 1980లో చేసిన అభినందన మందారమాల (తాండ్ర పాపారాయుడు), కృష్ణం వందే జగద్గురుం (ప్రైవేటు ఎల్‌ పి.) చాలు.
ఏదో ఒక సంగీతానికే కట్టుబడి వుండాలని ఈయన మడికట్టుకు కూర్చోలేదు. మారుతున్న కాలాన్నిబట్టి పరిస్థితులు ఎన్నో మారుతున్నాయి. అదే విధంగా సినిమా సంగీతంలో కూడా మార్పులెన్నో వచ్చాయి. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాన్ని, జాజ్‌, పాప్‌, రాక్‌, డిస్కో వంటి అధునాతన పాశ్చాత్య సంగీతాన్ని మనం అడ్జస్ట్‌ చేసుకోక తప్పలేని పరిస్థితి. వాటిని మనం అనుసరించడంలో తప్పులేదు. కానీ, కేవలం అనుసరించడం, అనుకరించడం కోసమై మన సంగీతానికి ప్రాణసమానమైన 'మెలొడీ' ని ఈతరంవారు మర్చిపోతున్నారు అని అన్న ఆయన మాటలు ఎంతయినా నిజం. ముఖ్యంగా ఈనాడు! సాంఘికమైనా, పౌరాణికమైనా తను నమ్ముకున్న మెలొడీకి ప్రాధాన్యతనిస్తూ సంప్రదాయ రాగాల్లో వుండేటటువంటి మధురిమను వదులుకోకుండా చక్కని చిక్కని పాటలు అందించాడు.
ఆహుతి (1950)తో తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్‌ చిత్రానికి సంగీతం నిర్వహించిన ఖ్యాతి కూడా ఈయనదే (శ్రీశ్రీకి కూడా సినీగేయ రచయితగా ఇది మొదటి చిత్రం.) సాధారణంగా డబ్బింగ్‌ సినిమాలలో పాటలన్నా, వాటి సంగీత దర్శకులన్నా లోకంలో కొంత చిన్నచూపుతో చూస్తాడు. అవే వరసలు మరల వాయించడమే కదా అన్నట్లుగా! కానీ ఆహుతిలో పాటలు ప్రేమయే జనన మరణ లీల (ఘంటసాల), హంసవలె ఓ పడవా వూగిసరావే ( ఘంటసాల, బాల సరస్వతి) జనాదరణ పొందాయంటే సాలూరి సంగీతం గొప్పగా తోడ్పడిందని చెప్పక తప్పదు. హిందీ చిత్రంలోని (”నీరా ఔర్‌ నందా”) వరసలన్నింటినీ పూర్తిగా మార్చి తన సొంత ముద్ర వేశాడు. ఇతరుల వరుసలు ఎప్పుడయినా అనుకరించినా, అవి హిందీ, బెంగాలీ వాసనలు కొట్టక తెలుగు పరిమళాలు వెదజల్లడానికి కారణం ఈయన పాట వ్రాయించుకున్న తీరు, ఒదుగులు అద్దిన విధము!
రాజేశ్వరరావు కుటుంబం అంతా సంగీతమయం. ఇతని అన్న సాలూరు హనుమంతరావు కూడా తెలుగు, కన్నడ సినిమాలలో సంగీత దర్శకులుగా పని చేశాడు. రాజేశ్వరరావు పెద్ద కొడుకు రామలింగేశ్వరరావు ప్రసిద్ద పియానో మరియు ఎలక్ట్రానిక్ ఆర్గాన్ విద్వాంసుడు. రెండవ కొడుకు పూర్ణచంద్రరావు ప్రసిద్ద గిటారిస్టు. ఈయన మూడవ మరియు నాలుగవ కొడుకులైన వాసూరావు, కోటేశ్వరరావులు కూడా ప్రసిద్ద సంగీత దర్శకులే. ముఖ్యంగా కోటేశ్వరరావు (కోటి) ప్రముఖ సంగీత దర్శకులు టీ.వీ.రాజు కోడుకైన సోమరాజుతో కలసి రాజ్-కోటి అన్న పేరుతో అనేక విజయవంతమైన ఎన్నో సినిమాలకు సంగీతం అందించాడు. తరువాత కాలంలో ఇద్దరూ విడిపోయి ఎవరికి వారే సంగీత దర్శకులుగా స్థిరపడ్డారు.
సంగీతం అందించిన సినిమాలు
జయప్రద (1939)
ఇల్లాలు (1940)
అపవాదు (1941)
బాలనాగమ్మ (1942)
చెంచులక్ష్మి (1943)
భీష్మ (1944)
పాదుకా పట్టాభిషేకం (1945)
రత్నమాల (1947)
వింధ్యరాణి (1948)
ఆహుతి (1950)
సహోదరులు (1950)
మంగళ (1951)
మల్లీశ్వరి (1951)
నవ్వితే నవరత్నాలు (1951)
ప్రియురాలు (1952)
పెంపుడు కొడుకు (1953)
రాజు-పేద (1954)
విప్రనారాయణ (1954)
మిస్సమ్మ (1955)
భలేరాముడు (1956)
చరణదాసి (1956)
మాయాబజార్ (1957) (నాలుగు పాటలకు మాత్రమే)
చెంచులక్ష్మి (1958)
అప్పుచేసి పప్పుకూడు (1959)
భక్త జయదేవ (1961)
ఇద్దరు మిత్రులు (1961)
భార్యాభర్తలు (1961)
భీష్మ (1962)
ఆరాధన (1962)
చదువుకున్న అమ్మాయిలు (1963)
పూజాఫలం (1964)
బొబ్బిలి యుద్ధం (1964)
మంచి మనిషి (1964)
అమరశిల్పి జక్కన (1964)
మైరావణ (1964)
డాక్టర్ చక్రవర్తి (1964)
దేశద్రోహులు (1964)
దొరికితే దొంగలు (1965)
పల్నాటి యుద్ధం (1966)
సంగీత లక్ష్మి (1966)
ఆత్మగౌరవం (1966)
పూలరంగడు (1967)
భక్త ప్రహ్లాద (1967)
వసంతసేన (1967)
బంగారు పంజరం (1968)
ఆత్మీయులు (1969)
ఆదర్శ కుటుంబం (1969)
చిట్టిచెల్లెలు (1970)
పవిత్ర బంధం (1971)
అమాయకురాలు (1971)
బాలభారతం (1972)
సెక్రటరీ (1976)
కురుక్షేత్రం (1977)
రాధాకృష్ణ (1978)
తాండ్ర పాపారాయుడు (1986)
దేవదాసు మళ్ళీ పుట్టాడు (1978)
నటించిన సినిమాలు
శ్రీ krishna లీలలు (1935)
శశిరేఖా పరిణయం(1936)
మాయాబజార్ (1936)
జయప్రద (1939)
ఇల్లాలు (1940)
బిరుదులు
సాలూరు రాజేశ్వరరావుకు ఆంధ్రా విశ్వవిద్యాలయం 1979లో డాక్టరేటుతో పాటు కళాప్రపూర్ణ బహూకరించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాన్గా నియమించుకుంది. ఇదే కాలంలోనే ఈయన స్వరపరచిన అన్నమయ్య కీర్తనలను ఘంటసాల పాడాడు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి బిరుదును ఇచ్చి సత్కరించింది.






కటారి కనకయ్య నాయుడు (31 అక్టోబర్ 1895 - 14 నవంబర్ 1967)


కొట్టారి కనకయ్య నాయుడు (Cottari Kanakaiya "CK" Nayudu) తొలి భారత క్రికెట్ జట్టు కెప్టెన్, పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు మరియు 1933లో విస్‌డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నాడు.
నాయుడు 1895, అక్టోబర్ 31న నాగపూర్లో ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. నాగపూర్లో పెరిగిన ఈయన పాఠశాల రోజులనుండే క్రికెట్ ఆటలో ఎంతో ప్రతిభ కనపరిచాడు. ఈయన ప్రధమ శ్రేణి క్రికెట్ ఆటలో ప్రవేశము 1916లో హిందూ జట్టులో, యూరోపియన్ జట్టుకు వ్యతిరేకముగా జరిగినది. ఈయన ఆ ఆటలో తమ జట్టు 79 పరుగులకు 7 వికెట్లు పడిన పరిస్థితిలో 9వ ఆటగాడిగా బ్యాటింగుకు దిగాడు. మొదటి మూడు బంతులు అడ్డుకొని, నాలుగో బంతిని సిక్సర్ కొట్టాడు. ఇలా మొదలైన ఈయన ప్రాబల్యం తన క్రీడాజీవితపు చివరినాళ్ల వరకు చెక్కుచెదరలేదు.
ఆరు దశాబ్దాలపాటు "ఫస్ట్ క్లాస్ క్రికెట్" ఆడిన కొద్దిమంది క్రీడాకారులలో సి.కె.నాయుడు ఒకరు. 1956-57 రంజీ ట్రోఫీలో తన 62 వ యేట అతను చివరిసారి ఆడాడు. ఆ మాచ్‌లో 52 పరుగులు చేశాడు.
ఈయన 1967, నవంబర్ 14న ఇండోర్‌లో మరణించాడు.

Saturday, February 28, 2009

కైకాల సత్యనారాయణ (25 జూలై 1935)


కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న ఆయన ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు.
సత్యనారాయణ కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో, కైకాల లక్ష్మీనారాయణకు 1935 జూలై 25 న జన్మించాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. 1960 ఏప్రిల్ 10 న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు మరియు ఇద్దరు కొడుకులు.
తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో, సినిమాల్లో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్ళాడు. ఆయన్ని మొదట గుర్తించింది డి.యల్.నారాయణ. 1959 లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చాడు. దానికి దర్శకుడు చంగయ్య. ఆ సినిమా బాక్సు ఆఫీసు దగ్గర బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. అలా గురించటానికి ఆసక్తి గల కారణం, ఆయన రూపు రేఖలు యన్.టి.ఆర్ ను పోలి ఉండటమే. యన్.టి.ఆర్ కు ఒక మంచి నకలు దొరికినట్లు అయింది. అప్పుడే యన్.టి.ఆర్ కూడ ఈయన్ని గమనించారు. 1960 లో యన్.టి.ఆర్ తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి లో ఈయనకి ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించినవారు యస్.డి.లాల్. ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేసాడు.
సత్యనారాయణను ఒక ప్రతినాయకుడుగా చిత్రించవచ్చు అని కనిపెట్టినది విఠలాచార్య. ఇది సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడుగా కనక దుర్గ పూజా మహిమ లో వేయించాడు. ఆ పాత్రలో సత్యనారాయణ సరిగ్గా ఇమడటంతో, తర్వాతి సినిమాల్లో ఆయన ప్ర్రతినాయకుడుగా స్థిరపడి పోయాడు.
ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే, సత్యనారాయణ కారెక్టర్ పాత్రలు కూడా వేసారు. ఇది ఆయన్ని సంపూర్ణ నటుడిని చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ లాంటి ఒక విలక్షణ నటుడు దొరకటం ఒక వరం. ఈయన వెయ్యని పాత్ర అంటూ లేదు. ఆయన ఏపాత్ర వేసినా ఆ పాత్రలో జీవించాడు. ఆయన యమగోల మరియు యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించాడు. కృష్ణుడిగా, రాముడిగా యన్.టి.ఆర్ ఎలానో, యముడిగా సత్యనారాయణ అలా! ఎస్.వి.రంగారావు ధరించిన పాత్రలు చాలావరకు సత్యనారాయణ పోషించారు.పౌరాణికాల్లో రావణుడు,దుర్యోధనుడు,యముడు,ఘటోద్గచుడు సాంఘికాల్లో రౌడీ,కధానాయకుని (కథాకనాయిక) తండ్రి,తాత మొదలైనవి.
సత్యనారాయణ రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించాడు.
1996 లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి 11వ లోక్‌సభ కి ఎన్నికయ్యాడు.

కొమ్మారెడ్డి సావిత్రి (6 డిసెంబర్ 1937 - 26 డిసెంబర్ 1981)


తెలుగు చిత్రసీమలోన కళాభినేత్రి
కోకిలంటి కంఠమున్నసుమధుర గాత్రి
కన్నులతో కథలు చెప్పు విశాల నేత్రి
నీ నటనతోనె ధన్యమయ్యేనీ ధరిత్రి....

తెలుగు సినీ ప్రపంచం లో మహానటి, కొమ్మారెడ్డి సావిత్రి (1937 డిసెంబర్ 6 - 1981 డిసెంబర్ 26) . తెలుగు తమిళ సినిమాల్లో కూడా నటించి, మహానటి అనిపించుకుని, తరాల తరువాత కూడా ఆరాధింపబడుతూంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో 1936 డిసెంబర్ 6 న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. తన ఆరవ యేటనే తండ్రిని కోల్పోవడము వల్ల పెదనాన్న సహాయముతో విజయవాడ లోని కస్తూరీబాయి మెమోరియల్ పాఠశాలలో మూడవ ఫారం (8వ తరగతి) వరకు చదువుకున్నది. శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం మరియూ శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చింది. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి, అనంతరం స్వయంగా పెదనాన్న నడిపిన నాట్య మండలిలో కూడా నటించింది. బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో కూడా నటించింది.

పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలనోర్చి తిరుగులేని అభినేత్రి గా విరాజిల్లింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలో చిన్న పాత్ర పొంది, ఆనక ఆ పాత్రకు తగ్గ వయసు లేదని అందులోనుండి తొలగింపబడింది. ఆ తరువాత కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ భైరవిలో ఒక చిన్న పాత్రలో నటించింది. పెళ్ళిచేసిచూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు. కాని అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది. తన నటనా ప్రతిభను నిరూపించుకోవటానికి ఆమె, నృత్యరూపకుడు మరియూ దర్శకుడూ అయిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా వరకూ ఆగవలసి వచింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో మిస్సమ్మ లో ప్రధానపాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడింది. ఆ తరువాత వచ్చిన దొంగరాముడు, అర్థాంగి, చరణదాసి ఆమె స్థానాన్ని పదిలపరచాయి.1957 లో వచ్చిన తెలుగు చిత్ర చరిత్ర లోనే అజరామరం అనదగిన మాయాబజార్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటనా వైదుష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణిమకుటం.అది మొదలు యెన్నో వైవిధ్యమైన పాత్రలను తనకే సాధ్యమైన రీతిలో పోషించి వాటికి ప్రాణ ప్రతిష్ట చేసింది.
ఆమె తమిళచిత్రాలలోనూ నటించి, పేరుతెచ్చుకుంది. తమిళంలోనూ మహానటి (నడిగెయర్ తిలగం) బిరుదు పొందింది. 1968 లో చిన్నారి పాపలు సినిమాకు దర్శకత్వం వహించింది.ఈ సినిమా కు ఒక ప్రత్యేకత వుంది.బహుశా దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా దాదాపు పూర్తిగా మహిళలచే నిర్మింపబడిన చిత్రంగా ప్రత్యేకత సంతరించుకున్నది . అయితే అది అంత విజయం సాధించలేదు.ఆ తరువాత చిరంజీవి,మాతృదేవత,వింత సంసారం మొదలగు సినిమాలకు దర్శకత్వం వహించింది. 1956లో అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ నటుడు జెమినీ గణేశన్ ను పెళ్ళిచేసుకుంది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు - విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. అయితే ఆ పెళ్ళి విఫలమైంది. ఆస్తిపాస్తులు కోల్పోయి, తాగుడుకు, మత్తుమందులకు, నిద్రమాత్రలకు బానిసై, 1981 డిసెంబర్ 26 న మరణించింది.
మల్లెపూలు, వర్షం సావిత్రికి ఇష్టమైనవి. ఆమెది ఎడమచేతి వాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేది. వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు "గ్యారీ సోబర్స్" కు సావిత్రి అభిమాని. ఆ రోజుల్లోనే శివాజీగణేశన్ తోపాటు తారల క్రికెట్లో పాల్గొనేది. ఆమె వద్ద ఏనుగుదంతంతో చేసిన చదరంగం బల్లకూడా ఉండేది. సావిత్రి మంచి చమత్కారి, అంతే కాదు ఇతరులను అనుకరించటంలో కూడా దిట్ట. ఆమె తన భర్త జెమినీ గణేశన్ను, రేలంగిని, సరోజాదేవిని, ఎస్వీ రంగారావుని, ఇంకా అనేకమందిని తరుచూ అనుకరించేది. దానధర్మాల విషయంలో అమెది ఎముకలేని చెయ్యి. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ని కలిసేందుకు వెళ్ళి, అక్కడ మొత్తం నగలన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసింది.
ఆమె సినిమాలు:
నటి గా
సంసారం (1950)
అగ్నిపరీక్ష (1951)
పాతాళభైరవి (1951)లో నృత్యకారిణి
పెళ్ళిచేసి చూడు (1952)లో సావిత్రి
పల్లెటూరు (1952)లో సుగుణ
ప్రతిజ్ఞ (1953)
దేవదాసు (1953)లో పార్వతి
బ్రతుకుతెరువు (1953)లో జమీందారుగారి కూతురు
మేనరికం (1954)
చంద్రహారం (1954)లో చంచల
బహుత్ దిన్ హుయే (1954) (హిందీ సినిమా)
పరివర్తన (1954)లో సుందరమ్మ వదిన
మిస్సియమ్మ (1955) (తమిళ సినిమా)
మిస్సమ్మ (1955)లో మేరీ/మహాలక్ష్మి
అర్ధాంగి (1955)
సంతానం (1955)లో శారద
కన్యాశుల్కం (1955)లో మధురవాణి
దొంగరాముడు (1955)లో సీత
చరణదాసి (1956)లో లక్ష్మి
భలేరాముడు (1956)
అమరదీపం (1956)లో అరుణ
వినాయకచవితి (1957)లో సత్యభామ/భూదేవి
తోడికోడలు (1957)లో
సుశీల ఎమ్మెల్యే(M.L.A.) (1957)లో నిర్మల
మాయాబజార్ (1957)లో శశిరేఖ
మాయాబజార్ (1957) (తమిళ సినిమా)లో శశిరేఖ
కర్పూరకరసి (1957) (తమిళ సినిమా)లో మంజుల
మాంగల్యబలం (1958)
అప్పుచేసి పప్పుకూడు (1958)లో మంజరి
నమ్మినబంటు (1959)
విమల (1960)
శ్రీవెంకటేశ్వరమహత్యం (1960)లో పద్మావతి
శాంతినివాసం (1960)
దీపావళి (1960)
చివరకు మిగిలేది (1960)లో పద్మ
పాపపరిహారం (1961)
పసమలార్ (1961) (తమిళ సినిమా)లో రాధ
పాండవవనవాసం (1961)లో ద్రౌపది
కలసివుంటే కలదుసుఖం (1961)
సిరిసంపదలు (1962)
పవిత్రప్రేమ (1962)
మనితన్ మరవిల్లై (1962) (తమిళ సినిమా)
మంచిమనసులు (1962)
ఆరాధన (1962)లో అనూరాధ
గుండమ్మ కథ (1962)లో లక్ష్మి
రక్తసంబంధం (1962)
ఆత్మబంధువు (1962)
రక్తతిలకం (1963)లో కమల
మూగ మనసులు (1963)లో రాధ
కర్ణలో (1963) భానుమతి
కర్ణన్ (1963) (తమిళ సినిమా)లో భానుమతి
ఘర్ బసాకే దేఖో (1963) (హిందీ సినిమా)
చదువుకున్న అమ్మాయిలు (1963)లో సుజాత
నర్తనశాల (1963)లో ద్రౌపది
వెలుగునీడలు (1964)లో సుగుణ
పూజాఫలం (1964)లో సీత
నవరాత్రి (1964)
కైకొడుత్తదైవం (1964) (తమిళ సినిమా)
గంగా కీ లెహరే (1964) (హిందీ సినిమా)
డాక్టర్ చక్రవర్తి (1964)లో మాధవీ దేవి
దేవత (1964)
సుమంగళి (1965)
తిరువిలయాదల్(1965) (తమిళ సినిమా)లో పార్వతి యొక్క వివిధ రూపాల్లో నటించింది.
నాదీ ఆడజన్మే (1965)
మనుషులు మమతలు (1965)
నవరాత్రి (1966)
భక్తపోతన (1966)లో సరస్వతీదేవి
ప్రాణమిత్రులు (1967)
వరకట్నం (1968)
తల్లితండ్రులు (1970)లో కౌసల్య
మరోప్రపంచం (1970)
అశ్వథ్థామ (1970)లో కుంజుని భార్య
జగన్మోహిని (1978)
అందరికంటే మొనగాడు (1985)
దేవదాసు మళ్లీ పుట్టాడు
గోరింటాకు (చివరి సినిమా)

నిర్మాతగా
ఏక్ చిట్టీ ప్యార్ భరీ(1985) (హిందీ సినిమా)
దర్శకురాలిగా
మాతృదేవత (1970)
ఇతరములు
నవరాత్రి (1966) సినిమాలో నేపథ్య గాయని

Friday, February 27, 2009

అల్లు రామలింగయ్య (1 అక్టోబర్ 1922 - 31 జూలై 2004)


అల్లు రామలింగయ్య పేరులోనే హాస్యం ఉంది. ఆయన హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. చారిత్రక కాలంలో కవిత్వంలో పలు ప్రక్రియలు చేపట్టి కవ్వించి , నవ్వించి ' వికటకవి గా తెనాలి రామలింగడు చరితార్థుడైతే , ఈనాటి సినీసీమలో అలాంటి స్థాన్నాన్ని పొందినవాడు అల్లు రామలింగయ్య .
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో 1922 అక్టోబర్ 1 న అల్లు రామలింగయ్య జన్మించాడు. చదువు పెద్దగా అబ్బలేదు. తన సహచరులతో కలసి ఆకతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడు. ఇదే క్రమంతో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది. ఊళ్లో కెవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారి వెంటే తిరుగుతూ ఉండేవాడు. వాళ్లతో స్నేహం చేయడం, ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగడం నిత్యకృత్యంగా చేసుకున్నాడు. ఎట్టకేలకు భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. అదీ మూడు రూపాయలు ఎదురిచ్చేట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియకండా వేసాడు. నాటకానుభవం పెద్దగా లేకున్నా కొద్దిపాటి నటనావగాహనతో తన వేషం మెప్పించాడు. ఆ తరువాత ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసి వాటిని అమ్మి నాటక కాంట్రాక్టరుకు ఇచ్చాడు. అలా మొదలైనంది ఆల్లు నట జీవితం.
అల్లు నాటకాల్లో నటిస్తూనే, తన సామాజిక బాధ్యతను గుర్తెరిగి గాంధీజీ పిలుపునందుకుని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్లాడు. జైలులో కూడా తోటివారిని పోగేసుకుని నాటకాలాడేవాడు. మరోవైపు అంటరానితనంపై పోరు సలిపాడు.
చలనచిత్ర జీవితంఅల్లు నాటాకాలు చూసిన గరికపాటి రాజారావు చిత్రసీమలో తొలిసారిగా 1952 లో పుట్టిల్లు చిత్రంలో కూడు-గుడ్డ శాస్త్రి తరహ పాత్రను అల్లుచే వేయించాడు. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి ' వద్దంటే డబ్బు ' లో అవకాశం వచ్చింది.
పుట్టిలు చిత్రం నిర్మాణకాలంలో తన భార్యా నలుగురు పిల్లలతో మదరాసుకు మకాం మార్చాడు. అల్లు తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డాడు. మరోవైపు హొమియో వైద్యం నేర్చుకున్న అల్లు ఏమాత్రం తీరిక దొరికినా ఉచితవైద్య సేవలందించేవాడు.
ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో నిలద్రొక్కుకున్నడు. అల్లు హాస్యపు జల్లునేకాదు కామెడీ విలనిజాన్ని కూడా బగా రక్తికట్టించాడు. అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గవి మూగమనసులు, దొంగరాముడు, మాయా బజార్,ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు, శంకరాభరణం మొదలైనవి వున్నాయి. ముత్యాలముగ్గు సినిమా చిత్రీకరణకు ముందు ఆయన కుమారుడు ఆకస్మికంగా మరణించినా బాధను మనసులో అణుచుకుని షూటింగ్ లో పాల్గొన్న గొప్ప నటుడు అల్లు. సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసాడు. 1116 చిత్రాల్లో నటించాలనే కోరిక ఆయనకు తీరలేదు. ఆతను అభినయించిన చాల పాటలకు బాలు గళం సరిగా అమరి పోయింది. ' మనుషులంతా ఒక్కటే ' చిత్రంలో 'ముత్యాలు వస్తావా అడిగిందీ ఇస్తావా అనే పాట అప్పట్లో హిట్.
అల్లు రామలింగయ్య నిర్మాతగా గీతా ఆర్ట్స్ బానర్ ని నెలకొల్పి ' బంట్రోతు భార్య ' దేవుడే దిగివస్తే , బంగారు పతకం చిత్రాలను నిర్మించాడు. చాలాకాలం తర్వాత అల్లు 90 దశకంలో ' డబ్భు భలే జబ్బు ' చిత్రం తీసాడు. రేలంగి, రమణారెడ్డి, కుటుంబరావు, బాలకృష్ణ వంటివారి కాలంతో మొదలు ఈతరం హాస్యనటులు వరకూ కొనసాగిన ఏకైక హాస్యనటుడు అల్లునే. ' ఆమ్యామ్య.. అప్పుం అప్పుం ' లాంటి ఊతపదాలు అతను సృష్టించినవే.
పురస్కారాలు, సన్మానాలుయాబైయేళ్లపాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ తెలుగు ప్రజానీకాన్ని అలరించిన అల్లును వరించిన సన్మానాలు, గౌరవాలు, , అవార్డులు అసంఖ్యాకమైనవి. భారత ప్రభుత్వం 1990 లో ' పద్మశ్రీ ' అవార్డు తో గౌరవించింది. రేలంగి తరువాత ' పద్మశ్రీ' అందుకున్న హాస్యనటుడు అల్లునే.
2001 వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత ' రఘుపతి వెంకయ్య ' అవార్డు ఇచ్చింది. పాలకొల్లులో ఆయన విగ్రహం నెలకొల్పారు. తన కోడుకు అల్లు అరవింద్ నిర్మాతగా స్థిరపడటం, అల్లుడు చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడం, మనవుడు అల్లు అర్జున్ హీరోగా మారడం అయనకు జీవితం లో సంతృప్తినిచ్చిన అంశాలు. అతని చివరి చిత్రం 'జై '
అల్లు రామలింగయ్య 2004 జూలై 31 వ తేదీన తన 82 వ ఏట కన్నుమూసాడు. మరణించేనాటికి తెలుగు చిత్రసీమలో అల్లురామలింగయ్యది ప్రత్యేక స్థానం. అతను భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన హాస్యం చిరంజీవిగా మనల్ని అలరిస్తూనే ఊంటుంది.
నటించిన సినిమాలుఇంద్ర (2002)

దేవుళ్ళు (2001)

మావిచిగురు(1996)

అల్లుడా మజాకా (1995)

ముఠామేస్త్రి (1993)

ఆ ఒక్కటి అడక్కు (1993)

మెకానిక్ అల్లుడు (1993)

పరుగో పరుగు (1993)

ఆపద్భాందవుడు (1992)

అశ్వమేధం(1992)

పెద్దరికం(1992)

రౌడీ అల్లుడు(1991)

నా పెళ్ళాం నా ఇష్టం (1991)

గ్యాంగ్ లీడర్(1991)

రాజా విక్రమార్క1990) కొదమ సింహం (1990)

జగదేక వీరుడు అతిలోక సుందరి(1990)

కొండవీటి దొంగ(1990) స్టేట్ రౌడీ(1989)

అత్తకు యముడు అమ్మాయికి మొగుడు(1989)

చలాకి మొగుడు చాదస్తపు పెళ్ళాం(1989)

ఖైదీ నెంబర్ 786(1988)

యముడికి మొగుడు(1988)

మంచి దొంగ(1988)

ఆఖరిపోరాటం(1988)

దొంగరాముడు(1988)

దొంగమొగుడు (1987)

చంటబ్బాయ్(1986)

మగధీరుడు(1986)

కిరాతకుడు(1986)

రావణబ్రహ్మ(1986)

విజేత(1985)

అడవిదొంగ(1985)

ఒకరాధ ఇద్దరు క్రిస్హనులు(1985)

జ్వాల(1985)

దొంగ (1985)

చట్టంతో పోరాటం(1985)

ముచ్చటగా ముగ్గురు(1985)